23, జులై 2010, శుక్రవారం

"స్ట్రీట్ చిల్డ్రేన్"


పదవ తరగతి లో కవయిత్రి "మహాజబిన్" రాసిన "స్ట్రీట్ చిల్డ్రేన్" కవిత మాకు పాఠ్యంశం గా ఉండేది.ఆ కవిత చదివినప్పుడల్లా బాధ గా అనిపించేది. అదే విషయాన్నీ తీసుకుని నా శైలి లో ఈ కవిత ను రాసాను......మిత్రులందరి కి చిన్న మనవి మనకు చేతనైనంత "వీధి బాలల " కు సహకరిద్దాం.
"నవ సమాజం లో
అనాగరికులం మనం
వారివి
ఎవరో చేసిన తప్పులకు
ప్రశ్నార్థకం గా మారిన బ్రతుకులు"
........................................
వారికి తోడంటు ఎవరున్నారు?
పసిమోము మీద
మిగిలిన కన్నీటి చారికలు తప్ప!
........................................
ఈ రోజు మీద ఆశ లేదు
రేపటి గూర్చి దిగులు లేదు
ఎవరి సహాయం కోసం
ఎదురు చూపుల్లేవు!
............................
లోకం వెక్కిరించిన
కాలం శూన్యం మిగిల్చిన
చిన్నిబ్రతుకుల్లో కారు చీకట్లు కమ్ముకున్న
పసి భుజాల మీద భారం మోస్తూ
వెనుదిరిగి చూడకుండా
ముందుకు సాగిపోవడమే తెలుసు
పయనం "అగమ్య" గోచరమైన!
...................................
ఎవరిని అడగాలి
ఏమని అడగాలి
గారాలుపోతూ
ఆరాలు తీయడానికి అమ్మ,నాన్న లు లేరు మరీ!!
....................................
ఆ జగన్నాథుని కే
మా మీద జాలి లేకపోతె
ఇంకెవరికి విన్నవించుకోవాలి?
బరువైన గుండెలతో
సాగిపోవడం తప్ప!!
.............................

3, జులై 2010, శనివారం

"సీతాకోకచిలుక"


వన్నె చిన్నెల సీతాకోకచిలుక!!
నీలా
రెక్కలకు రంగులద్దుకోవాలి,
నీలాల నింగిలో
స్వేఛ్చ గా విహరించాలని,
నవ్వులను చిందించే
అందాల కుసుమలున్న పూదోటలో,
మకరందాన్ని ఆస్వాదిస్తూ
పరవశింప చేసే ప్రకృతి ఒడిలో
ఒక క్షణికమైన చాలు
జీవించి తరించాలని
నా కోరిక...
.............
ఎందుకని ఆ మందహాసం
నేను
నీలా విప్పారిన రెక్కలతో
ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ
పూదోటలో దోబూచులాడలేననేగా!!

26, జూన్ 2010, శనివారం

"అద్దం"

నీవు
"స్వచ్చత" కు మారు పేరు
మల్లెలాంటి మనసల్లే!
.........................
నన్ను నీలో
ప్రతిబింబింప చేస్తావు
"నా" లోకి నన్ను
తరచి చూసుకునేలా చేస్తావు
.............................
బాహ్య ప్రపంచం కోసం
నే వేసుకున్న "ముసుగు"
ఆ "ముసుగు" వెనుక
నే పడుతున్న ఆవేదన
నీకు తప్ప
మరి ఇంకెవరికి తెలుసు?

21, జూన్ 2010, సోమవారం

"కామశాస్త్రి Vs పిల్లకాయలు "

ఆ మధ్య ఒక టపా లో మా ఇంటర్ కాలేజీ లో "నా నిద్ర" సంగతు లు మాట్లాడుకున్నాము కదా!...మరి కాలేజీ అన్నాక డైరెక్టర్, ప్రిన్సిపాల్ etc ఉంటారు కదా..మా ప్రియతమ "డైరెక్టర్" గారి పేరు "కామశాస్త్రి", పిల్లకాయల కి ఆయన అంటే గౌరవం, భక్తి, అంతకు మించి బోలెడంత భయం.
కామశాస్త్రి గారూ చూడడాని కి నల్ల గా ,దానికి తోడూ చాలా లావు గా ఉంటారు, కావున సహజంగా నే పిల్లకాయల కి అయన అంటే భయం. ఆయన ఎక్కువ గా మాట్లాడారు, కాకపోతే "కంటి చూపు తో" చంపేసే రకం. ఆయన ఇంటర్ రెండో సంవత్సరం పిల్లల కి గణితం సబ్జెక్టు లో "సదిశ" లు చెప్పేవారు. మేము మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు "ఇడ్లి టిఫిన్' ఉన్న రోజున పిల్లలంత టిఫిన్ పడేస్తున్నార ని తెలిసి "మా హాస్టల్ క్యాంటిన్" కి ఒకసారి చూడడాని కి వచ్చారు....ఇంకాచెప్పొద్దూ ఎప్పుడు ఇడ్లి పడవేసే మేము ఆ రోజు పెట్టిన ఇడ్లిలు చక్క తినేసం బుద్దిమంతుల్లా...
ఇంకా మేము రెండో సంవత్సరం లోకి వచ్చేసరి కి అప్పటి వరకు " కో-ఏడ్" గా ఉన్న కాలేజీ ని కాస్త ఆయన రెండు గా విభజించేశారు. ఒక్క ఇంటర్ రెండో సంవత్సరం తప్ప నా తక్కిన చదువంత "కో-ఏడ్" తరహ లోనే సాగింది. మా ప్రత్యేక "మహిళా కళాశాల" నాకు విచిత్రం గా అనిపించేది, అంత "అమ్మాయిల " మాయం. కొన్ని తరగతులు "కంబైండ్" తరహ లో సాగేవి....అందులో "సదిశలు" కూడ ఒకటి.

ద్వితీయ సంవత్సరం ఒక్క తెలుగు మీడియం లోనే రెండు వందల పైచిలుకు విద్యార్ధులు ఉండేవారు....అందరి కి కలిపీ కామశాస్త్రి గారి "సదిశ లు " క్లాసు కాలేజీ గ్రౌండ్ లో ఉన్న పెద్ద చెట్ల నీడన సాగేవి. కామశాస్త్రి గారి కి ముందు వరుస లో అమ్మాయి లు, ఆ తర్వాత అబ్బాయి లు కూచునేవాళ్ళు. ఆయన గొంతు చాలా గంభీరం గా ఉండేది, ఈ చివర నుండి ఆ చివర దాక ఒకే రీతి లో వినిపించేది.... ఎక్కువ గా ఈ క్లాసు లు మద్యాహ్నం పుట జరిగేవి,చెప్పేదేముంది అందరి కి ఆ క్లాసు లో నిద్ర వచ్చేది....కాకపోతే ఆయన గారి కి భయపడి ఎవరు కళ్ళు మూసుకుని నిద్ర పోవడాని కి సాహసించేవారు కాదు, "కళ్ళు తెరిచి" మాత్రం కొందరు నిద్ర పోయేవారు,అందులో నేను ఒకదాన్ని.క్లాసు మధ్య లో ఎవరైన నిద్ర పోతున్నార? అని ఆయన గమనించేవారు...ఎవడైనా దొరికాడ!! అంతే సంగతు లు....నిద్ర పోయేది అమ్మాయి లు అయితే మాత్రం కోపం గా చూసేవారు...అదే అమ్మాయి ల కు పెద్ద శిక్ష.

"study hours" లో ఎవరైనా సరిగ్గా చదవక పోయిన, అల్లరి చేసిన ,తక్కువ మార్కులు వచ్చిన ....కామశాస్త్రి గారి నోటి లో, చేతి లో నలిగి పోయేవారు పాపం పిల్లకాయలు :(

13, జూన్ 2010, ఆదివారం

"కలం"

నా కలాని కి
విరహా గీతాల తో
పరిచయం శూన్యం
ప్రకృతి సోయగాల
వర్ణన జాడలు
మచ్చుకైన ఎరుక లేదు
..............................
ఊహల కు దూరం గా
వాస్తవాని కి దగ్గర గా
చితికిన బ్రతుకు ల
ఆర్త నాదాలు
ఆకలి కేకలు
కనుమరుగవుతున్న
"మానవత్వపు" విలువలు
ఇవేనేమో!!
నాలో ఆలోచనలు రేపి
"నా కలాన్ని"
కదిలిస్తాయి
కరిగిస్తాయి
ఒక "నవ కవిత కు"
జీవం పోస్తాయి

5, జూన్ 2010, శనివారం

నేను,చదువు,కుంభకర్ణుడి నిద్ర

ఈ మధ్య ఫ్రెండ్ ఒకరు మాట ల మధ్య నీ బ్లాగ్ లో స్కూల్ డేస్, లేదా కాలేజీ డేస్ గురించి రాయొచ్చు కదా! అని అడిగితే, రాయొచ్చు కాని నాకే బద్ధకం రాయడానికి అని సెలవిచ్చాను.సరే లే బద్దకం లో భాగం అయిన "నిద్ర" గురించి రాస్తే పోలా ...
నేను ఇంటర్ కోసం అని పక్క ఊళ్ళో ఉన్న రెసిడెన్సియల్ కాలేజీ లో చేరిపోయాను. నా లక్ష్యం "BITS PILLANI" లో B.Tech చేయాలనీ, అక్కడ అయితే బాగా చెప్తారని, ఇంట్లో పేచి పెట్టి చేరి పోయా..పదవ తరగతి వరకు బాగా చదివేదాన్ని, బాగా అల్లరి చేసేవాళ్ళం. పెద్ద గా చదవండి అని ఎవరు ఇబ్బంది పెట్టె వారు కాదు, చాలా ఆనందం గా గడిచి పోయాయి ఆ రోజులు. కాని ఈ కాలేజీ మొదటి రోజే జైలు ని తలపించింది....


పొద్దున్న ఐదు గంటలకి చదువు మొదలవుతుంది, రాత్రి ఎన్మిదింటి కి ముగుస్తుంది. కొత్తలో బాగానే చదివేదాన్ని. అదంతా మెకానికల్ గా అనిపించడం మొదలైంది. పొద్దున్న "study hours" లో కొద్ది సేపు చదివి నిద్ర లోకి జారి పోయేదాన్ని. ఇది గమనించిన మా లెక్కల మాష్టారు "నాగరాజు గారూ" నన్ను తన ముందు బెంచి లో కూచోమని చెప్పి లెక్కలు చేయమని చెప్పేవారు. కొద్ది సేపు చదివేదాన్ని...తర్వాత మళ్లీ కథ మొదటికే వచ్చేది.
క్లాసు లు 8 గంటల కి మొదలయ్యేవి. కొద్ది సేపు విని నిద్ర ని కంట్రోల్ చేసుకోడాని కి నోట్ పుస్తకం లో హిందీ, ఆంగ్లం లో ఇష్టం వచ్చినట్టు గా రాసేదాన్ని. పక్కనే ఉన్న నా స్నేహితురాలు నందన కి ఇదేమి అర్థం అయ్యేది కాదు. సురేష్ మాష్టారి బౌతిక శాస్త్రం క్లాసు లో మాత్రం నా కష్టాలు వర్ణనాతీతం. ఆ క్లాసు లో ఎవరైన నిద్ర పోడానికి సాహసించార...అంతే సంగతులు....తిట్ల వర్షం,అబ్బాయి లనైతే ఏకం గా "డెమో స్టేజి" మీద దిష్టి బొమ్మ లాగ నిలుచోబెట్టేవారు. నిద్రను కంట్రోల్ చేసుకోడాని కి ఆ క్లాసు లో పడ్డ తంటాలు దేవుడి కి ఎరుక, మా నంది కి కూడ కొంచం తెలుసు.
పరీక్షల ముందు గ్రౌండ్ లో కూచో బెట్టేవారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళను వేరు గా కూచో బెట్టేవారు. ఎందుకో మరి పెద్ద పరీక్షలప్పుడు మమ్మల్ని,ఇంగ్లీష్ మీడియం వాళ్ళను కలిపి కూచో బెట్టారు. నన్ను ఒక ఇంగ్లీష్ మీడియం అమ్మాయి పక్కన కూచోబెట్టారు, ఎప్పుడు నిద్ర పోయే నా దగ్గర నోట్ పుస్తకాలూ ఉండవు...లెక్కలు పరువలేదు కాని వేరే విషయాలు ఇంగ్లీష్ లో నాకు అర్థం అయ్యేవి కాదు...చాలా ఏడుపు వచ్చేది, నందన కాస్త నోట్ పుస్తకాలూ సహయం చేసేది. పరీక్షలు వేరే సెంటర్ లో రాసేవాళ్ళం, మధ్య లో నిద్ర వచ్చి ఏదో రాసేదాన్ని ఆంగ్లం లో ,మళ్లీ తేరుకుని సరి చేసి రాసేదాన్ని. ఇలా నా కష్టాలు సాగాయి.
కొసమెరుపు ఏమిటి అంటే నాకు తొమ్మిది వందలకు కుంచం మార్కు లు తగ్గాయి. BITS దేవుడెరుగు. అమ్మో, జైలు గోడలు కలలో కూడ నన్ను వెంటాడుతాయి ఇప్పటి కి. మా నందన మాత్రం నా నిద్ర విషయం గుర్తు చేసి ఏడిపిస్తూ ఉంటుంది.

28, మే 2010, శుక్రవారం

"కిటికి"

రంగుటద్దాల కిటికీ కి ఆవలి వైపు
విశాల ప్రపంచం
వినీల ఆకాశం
.........................
కిటికీ కి
ఈ వైపు
నేను
........................
నా మదిలోని ఆలోచనలకూ
రెక్కలు తొడిగి
రంగుల ప్రపంచం లోకి
ఎగిరిపోవాలనుకున్నాను
....................................
ఆ వినూత్న ప్రపంచంలో
సమస్యలకు ఎదురీదుతూ
ముందుకు సాగగలనా?
.................................
ఏమో!
రాజీపడిపోయి
కిటికీ కి
ఈ వైపు
మిగిలిపోయాను
పంజరం లోని రాచిలకలా!

18, మే 2010, మంగళవారం

మధుర "మీనాక్షి"



మీరు ఎప్పుడైనా మదురై వెళ్ళారా? మీనాక్షి అమ్మ వారి గుడి ఎంత మధురం గా ఉంటుంది...అంతే మధురం గా ఉంటుంది మా "మీనాక్షి" ,తనది మదురై.

నేను MBA కోసం మంగుళూరు వెళ్ళాను. నాకు తొలిసారి గా కాలేజీ లో తను పరిచయం అయ్యింది. చాలా మంచి అమ్మాయి. నాకు తెగ నచ్చేసింది. తను మాకు మదురై విశేషాలు చెప్పేది, సబ్జెక్టు లో నాకు ఏది అర్థం కాక పోయిన వివరించి చెప్పేది. తక్కువ మార్కు లు వచ్చి నేను బాధ పడినప్పుడల్లా ఓదార్చేది. మాకు "తమిళ నాడు " వంటకాలు చేసి పెట్టేది. మా గ్రూపు లో తెలుగు వాళ్ళ సంఖ్య ఎక్కువ...తమిళ జాతి వాళ్ళు "నల్ల గా" ఉంటారని ఏడిపించే వాళ్ళం, తను మాత్రం "మేము నల్ల గా ఉన్న మా మనసు తెలుపు" అని సమాధానమిచ్చేది. ఉత్తర భారతానికి చెందిన ఇంకో గ్రూపు తనని "మదురై అమ్మ" అని ఏడిపించే వాళ్ళు.

మీనాక్షి మహా చురుకైన పిల్ల, చాలా తొందర గా తెలుగు నేర్చుకుంది, ఇంకా తన ముందు తెలుగు మాట్లాడడం మానేసాం మేము. తను మమ్ము "కుక్క,పంది" అని తిట్టేది, మేము చాలా నవ్వుకునే వాళ్ళం. ఆ అమ్మాయి అంటే మా అందరి కి అభిమానం. తను ఇంటి నుండి వచ్చేప్పుడు మా అందరి కి సరిపడేంత ప్రసాదం, తినుబండారాలు తీసుకు వచ్చేది.

ఒకసారి తను నన్ను మదురై తీసుకు వెళ్ళింది. మేము ట్రైన్ లో ముందు కోయంబత్తూరు వెళ్లి, తర్వాత బస్సులో మదురై వెళ్ళాలి. మాకు ట్రైన్ లో ఒకే బోగి లో సీట్లు దొరక లేదు, ఇంకా తను చాలా కంగారుపడింది, నేను ఎలా ఉంటానో అని . పొద్దున్నే మేము స్టేషన్ లో దిగాం, లగేజి మోసేవాడు ఎక్కువ అడిగే సరికి వాణ్ణి తమిళం లో నాలుగు తిట్టేసరికి వాడు చక్క పోయాడు. మేము ఉపాహారం కోసం ఒక హోటల్ కి వెళుతుండగా ఆ దారిలో వెళుతున్న తమిళులను చూసాను, వాళ్ళు చాలా సాంప్రదాయబద్దం గా ఉన్నారు, నాకు అప్పటి నుండి వారి సంస్కృతి మీద గౌరవం పెరిగింది.

మదురై లో నేను చాలా ఆనందం గా గడిపాను, వాళ్ళ కుటుంబం, బందువులు ఇంకా వాళ్ళింట్లో ఉన్న పాటి (అవ్వ)
అందరు తెగ నచ్చేసారు నాకు. నాకు "మధుర మీనాక్షి" అమ్మ వారి గుడి చాలా నచ్చింది, అంత అద్భుతమైన దేవాలయం చూడడము నా జీవితం లో అదే మొదటి సారి కాబోలు. నాకు మా మీనా వల్ల, తమిళ సంస్కృతీ, భాష మీద అభిమానం ఏర్పడింది.
తనని చూసి దాదాపు ఏడాది గడిచింది, చదువులు ఐపోగానే ఎవరి ఇళ్ళకు వాళ్ళం వచ్చేసాం, ఇంకా కలవలేక పోయాను. ఎంతైనా మా మీనా పాటి(అలా పాటి అని ఏడిపిస్తూ ఉంటాను) మధురమే ఆ మీనాక్షి అమ్మవారి లా....
తన తో స్నేహం దేవుడిచిన వరం నాకు.

16, మే 2010, ఆదివారం

"చిట్టి పొట్టి చెల్లాయి"

ఈ రోజు నా చిట్టి చెల్లి "మౌనిక" పుట్టిన రోజు :-)

చిట్టి పొట్టి చెల్లాయీ !

ప్రకృతి సోయగాలు

అందాల హరివిల్లు
ఆకాశం లో
తలుకులినే తారకలు
అందం గా విరిసిన కుసుమాలు
కమ్మని కలలు
ప్రతిది నీ కోసమే సుమా!
..................................
నీ కల లు పండాలి
నీవు చిర కాలం వర్ధిల్లాలని
నా కన్నయ్యను ప్రార్థిస్తున్నాను !!

13, మే 2010, గురువారం

"Paulo Coelho" - గొప్ప రచయిత



Paulo Coelho ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రచయిత . నేను ఆయన రాసిన పుస్తకాలు కొన్ని చదివాను. ఆ సంగతులు మీతో.
మా MBA కాలేజీ లో మంచి గ్రంథాలయం ఉండేది. నా సహపాటి నన్ను "The Alchemist" చదవమని చెప్తే పుస్తకం తెచ్చుకుని చదివా, చాలా అద్భుతం గా ఉంటుంది ఆ పుస్తకం. " మనం ఒక గొప్ప కార్యాన్ని గట్టిగా చేయాలనీ తలిస్తే ఈ విశ్వం అందుకు మనకూ సహకరిస్తుంది" అనేది సారాంశం. చాలా బాగా రాసారు. నేనైతే ఆ నవల అయిపోయేదాకా వదలకుండా చదివాను. కథ చెప్పే విధానం చాలా బాగుంటుంది.
"Like the Flowing River" అనేది Paulo రాసిన వ్యాసాల సంపుటి. ఈ పుస్తకం లో రచయిత వివిధ దేశాలకు వెళ్ళినపుడు అతని కి ఎదురైన అనుభవాలు, వివిధ మతాల గురించి చిన్ని కథలు ఉంటాయి. ప్రతి వ్యాసం ఒక సందేశాన్ని కలిగి ఉంటుంది. చాలా సాధారణ విషయాలను కలిగి, మనకు సందేశాన్ని ఇచ్చే మంచి వ్యాసాల సంపుటి ఈ పుస్తకం. ఈ పుస్తకం చదువుతుంటే నాకు రచయిత వ్యక్తిత్వం కూడ గొప్పగా ఉంటుందనే గట్టి నమ్మకం కలిగింది.
ఆ నమ్మకం తోనే నేను ఆయన కి e-mail పంపాను, నేను ఎలాంటి జవాబు ఆశించలేదు, ఎందుకంటే అతడు ప్రతి రోజు వివిధ దేశాలను సందర్శిస్తూ, వివిధ అంశాలలో పాల్గొంటూ ఉంటాడు. ఆశ్చర్యం నాకు కొద్ది పాటి రోజుల్లోనే తన నుండి జవాబు వచ్చింది....నా ఆనందానికి హద్దులు లేవు ఆరోజంతా. Paulo మీద నాకు గౌరవం హెచ్చింది.
ఇంకా అతడు రాసిన తక్కిన పుస్తకాలు చదవలసి ఉన్నది. చదవగానే మీతో ఆ విషయాలు చర్చిస్తాను.
సెలవు!!
మీ నేస్తం
రాధిక

9, మే 2010, ఆదివారం

"మా మంచి అమ్మ"


మా అమ్మ నాకు ప్రత్యేకం. ఈ కవిత మా "అమ్మ" కు అంకితం.
అమ్మ!
నీ గర్భం అనే "దేవాలయం" లో
నేను ఊపిరిపోసుకున్నాను
....................................
ఈ రంగులలోకం లోకి
నీవున్నావనే
నమ్మకం తోనే అడుగిడాను
.....................................
నీ ఆత్మీయ స్పర్శ
నీ అనురాగపు పలుకులు
నీతో నే గడిపిన ప్రతిక్షణం
నాకు విలువైన జ్ఞాపకాలే
...............................
నే గెలిచినా -ఓడిన
నీవు నాతోనే ఉన్నావు
.............................
ఈ ప్రపంచం
నన్ను ఒంటరిని చేసిన
ముందుకు సాగుతూనే ఉంటాను
నీవు నాతోనే ఉన్నావనే ధీమాతో!!!

8, మే 2010, శనివారం

అమ్మ

కలం కదిలించాను

"అమ్మ"

నీ గూర్చి

వర్ణించడానికి

..................

ఏమని రాయాలి

నిను పోల్చుకోడానికి

సరితూగు పదాలే కరువయ్యాయి

4, మే 2010, మంగళవారం

"నందన"


నా స్నే"హితురాలు" నందన పుట్టినరోజు కానుక.......
చుక్కలాంటి ఓ చక్కనమ్మా
నీవు
"నందన" వనం లో
అరవిరిసిన
పూబాలను తలపిస్తావు
నీ పలుకులు
గల గల పారే సెలయేళ్ళు
మల్లెలాంటి
మనసు నీ సొంతం
మన "బంధం"
పదాలకు అందని
చక్కని "అనుబంధం"

30, ఏప్రిల్ 2010, శుక్రవారం

చిన్ని కృష్ణుడు !!



గోవిందుడు అంటే నాకు ప్రాణం. ఈ చిన్ని కవిత ను నా స్వామికి భక్తి తో అంకితం చేస్తున్నాను.

"కమ్మని ప్రేమని పంచే అమ్మలా
బాధలో కన్నీటి చుక్కలా
నాకు ఒక మార్గదర్శిలా

నాలోని మంచి-చెడు ను మన్నించి
అను నిత్యం నాతో సాగే
ఓ గోవిందా
నీకు నా నమస్సులు!!

మహాకవి శ్రీ శ్రీ గారి శతజయంతి సందర్భంగా....


1238301269srisri.jpg

నీ కవిత
ఓ ప్రళయాగ్ని
ఓ విప్లవ గీతిక
సామాన్యుని ఆవేదనకు
ఆలంబన గా నిలిచిన ఒక అయుధం
................

నీవు
తెలుగు పదాలలో వెలుగును నింపి
ఆ వెలుగులతో
నరజాతి ని కదిలించావు
..........................

ఓ మహాకవి
నీకు అర్పించుటకు
ఆణిముత్యముల వంటి తెలుగు పదాలను
ఏర్చి-కూర్చి
మాలను కట్టాను

8, ఏప్రిల్ 2010, గురువారం

ఉగాది (కొన్ని కారణాంతరాల వల్ల ఆలస్యం గా ప్రచురించడము జరిగినది)

"చైత్ర మాసపు అందాలు
కోకిలమ్మ కూహు కూహు రాగాలు
మావి చిగురు పలకరింపులు
నీ రాకకు సంకేతాలు"

"నువు తెచ్చే షడ్రుచుల సమ్మేళనం
జీవితం లోని కష్టసుఖాలకు ప్రతిబింబం"

"ఉగాది
ఓ నవ "యుగాది"
మా జీవితాల్లోకి నవ కాంతిని తీసుకు రావాలని
ఆకాంక్షిస్తూ
నిండు హృదయముతో
నీకు స్వాగతం పలుకుతున్నాను"
 

ఫ్యామిలి ఫోటో


నేను ఈ మద్య "ఉగాది" పండక్కి ఇంటికి వెళ్ళాను..ఓ రోజు సాయంత్రం టీవీ చూస్తుకూచున్నాను ఏమిపాలుపోక , అప్పుడొక చిన్న సంగటన జరిగింది. ఆ చిన్ని సంగటన  నన్ను ఆలోచింపచేసింది...నేను టీవీ చూస్తున్ననా, ఇంతలో  మా అన్నయ్య వాళ్ళ బాబు పెన్ను, పేపర్ తో నా దగ్గరకొచ్చాడు, వాడికి నిండా  మూడేల్లుండవు. వాడు నన్ను బొమ్మ గీసివ్వమని అడిగాడు, సరే అనేసి  నేను దోతి వేసుకున్న చిన్న బాబు ను  గీసాను, వాడు అది తనే అని గుర్తు పట్టాడు (ఉగాది కి వాడు పంచె కట్టుకుని  ఊరంతా ఓ రౌండ్ వేసి  వచ్చాడు అది సంగతి), నేను వాళ్ళ అమ్మ, నాన్న బొమ్మలు  కూడ వేసిచ్చాను పనిలో పనిగా . వాడు నన్ను "అత్త దీంట్లో నువ్వు లేవు కదా నిన్ను కూడ గియ్యి అని అడిగాడు నేను చాలా ఆశ్చర్యపోయా! అలా వాడు మా కుటుంబ సభ్యుల  బొమ్మలన్నీ వేసేదాకా నన్ను వదలేదు....నాకు చాల ఆనందమేసింది  వాణ్ణి చూసి....వాళ్ళ నాన్నగారి పెంపకం చూసి ఒకింత  గర్వం గా  కూడ  అనిపించింది. మా అన్నయ్య చాల మంచి మనిషి, విలువలు తెలిసిన మనిషి, మా వదిన ఎప్పుడు అంటూ ఉంటుంది వీడు మీ అన్నయ్యలాగా అవుతాడో లేదో  అని...ఆ క్షణం లో అనిపించింది వీడు  మా అన్నయ్యకి మల్లె "మంచి వాడనిపించుకుంటాడు అని "
"న్యూక్లియర్  ఫ్యామిలీ అంశం  పుణ్యమా అనీ మన ఫ్యామిలీ ఫోటో లో మమ్మీ, డాడీ తప్ప ఎవరు కనిపించ కుండ పోతున్నారు..."మొక్కై  వంగనిది మ్రానై  వంగునా" అని సామెత, పిల్లలకు మంచి విలువలు నేర్పాల్సిన బాద్య త ఎంతయినా  తల్లి దండ్రుల పైన ఉంది."

7, మార్చి 2010, ఆదివారం

"స్త్రీ మూర్తి కి వందనాలు" (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా)


"సహనం లో భూమాత ను తలపించే
ఆ స్త్రీ మూర్తి

జీవితం అనే నాటకం లో
పలు పాత్రలకు జీవం పోసింది"
........................................
"ఒక తల్లిగా
బిడ్డకు జన్మనిచ్చి, లాలించి, పాలించింది

సోదరిగా
అక్కున చేర్చుకుంది
మిత్రురాలిగా
ఆదర్శప్రాయం గా నిలిచింది

భార్య గా తోడూ-నీడ గా నిలిచిన

ఆ స్త్రీ మూర్తి కి నా వందనాలు"

4, మార్చి 2010, గురువారం

చినుకు

ఒక నాటి సాయంకాలం
వాన చినుకు
నింగిని విడిచి
నేలను చేరింది
ధరణి మాత పులకించింది!
.............................
వాన రాకతో
మా పైరు తడిసింది
రైతన్న హృదయం
ఆనందంతో పరవసించింది!

1, మార్చి 2010, సోమవారం

తెలుగు భాష మీద నాకున్న అభిమానం







ఎందుకో తెలిదూ గాని నా చిన్ననాటి నుంచి తెలుగు భాష అంటే నాకు వల్లమానిన అభిమానం. మా బడి లోని గ్రంథాలయము లో ఉన్న పుస్తకాలూ అన్ని పొల్లు పోకుండా చదివేదాన్ని, ఊళ్ళో ఉన్న ప్రభుత్వ గ్రంథాలయానికి తరచూ వెళ్ళేదాన్ని, పక్కింట్లో "బుజ్జాయి" పుస్తకం ప్రతి ఆదివారం వచ్చేది అది తప్పక చదివేదాన్ని. నాకు తెలుగు కథలన్న, కవితలన్న, పద్యాలన్నా ఇష్టం. శ్రీ శ్రీ గారి కవితల చలువ వల్ల నేను కవిత్వం రాయడం ప్రారంభించాను. "ఈనాడు ఆదివారం" గురించి ప్రత్యేకం గా చెప్పాలి నా వ్యక్తిత్వ వికాసానికి గానీ, నేనూ నా లక్ష్యం దిశగా పయనించడానికి గానీ పరోక్షంగా తోడ్పడుతూనే ఉంది. ఇప్పుడైతే ఆంగ్లం మీద మోజు కాస్త పెరిగింది గాని తెలుగును ఎక్కడో నిర్లక్ష్యం చేస్తున్నానన్న భాద...అందుకే ఈ బ్లాగ్ తెలుగు లోనే రాయాలని అనుకుంటున్నాను...నేనూ కారణాంతరాల వాళ్ళ మానేసిన "కవిత సామ్రాజ్యాన్ని" మళ్లీ పునరుద్దరించడానికి పూనుకుంటున్నాను....

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

నా దేశం



"వందనాలు తల్లీ భారతి వందనలమ్మా

నా కెంత గర్వం

ఈ నేల న పుట్టానని, ఈ గాలిని శ్వాసిస్తున్నాననీ

.......................................

అన్నీ అధ్బుతాలే

ఈ మట్టి సువాసన, ఈ మనుషుల మనసులు,

నేను పెనవేసుకున్న అనురాగాలు, ఆత్మీయతలు

..............................................

ఏ శిల్పి నిను మలిచేనో విభిన్న సంస్కృతులను పలు వర్ణాలతో

ఏమని వర్ణించను ఘన చరితకు సాక్షిగా నిలచిన నిను

.................................................

ధన్యురాలిని తల్లీ నీ కడుపున పుట్టినందుకు

హాయిగా కనుముస్తాను నీ చల్లని ఒడిలో"

మా మంచి నేస్తం






మనకంటూ బాల్య మిత్రులు ఉంటారు, నేను నాకు ఎంతో ప్రియమైన మిత్రురాలి గురించి చెప్పాలను కుంటున్నాను...తనూ నాకు శిశు తరగతి లో పరిచయం, తనకు బడికి రావడమంటే ఇష్టం, అందుకనే వాళ్ళ అన్నయ్య తో కూడా వచ్చేది, ఎప్పుడు పరిచయం అయిందో తెలిదు కానీ నేను ఒకటవ తరగతి చదివేటప్పుడు ఇద్దరమూ ఒకే దగ్గర కూచొని ఫోటో దిగాము అది ఇప్పటికి నా దగ్గర భద్రం, తను ఇంట్లో చెప్పకుండా ఓరోజు మాఇంటి కొచ్చి నాతో పాటు భోంచేస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు తన కోసం ఊరంతా తిరిగి మా ఇంటికొచ్చారు...ఇంకేముంది చక్కగా నాలుగు తగిలిచ్చారు. పదవ తరగతి వరకు ఒకే బెంచి లో కూర్చునే వాళ్ళము, ఇంటర్, డిగ్రీ వేరే కాలేజీ లో చదివిన అడపా దడపా కలుస్తూనే ఉండే వాళ్ళం. నన్ను తన సైకిల్ ఫై తిప్పేది....క్రికెట్ మ్యాచ్ లూ కలిసే చూసేవాళ్ళం ఇప్పుడూ అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటామూ కానీ మునుపటికి మల్లే అల్లరి చేయడానికి కుదరదు, నాకు సంతోషామేసిన, భాదేసిన తన తో పంచుకోవడమంటే నాకు చాలా ఇష్టం....మీకు నాలాగే దేవుడిచ్చిన అపురూపమైన స్నేహితులు ఉండే ఉంటారు వాళ్ళను వదులు కోకండి ఎందుకంటే వాళ్ళు మనము సంపాదించుకున్న విలువైన ఆస్తులూ....!!! మన బాల్యపు జ్నాపకాలూ!!!

25, ఫిబ్రవరి 2010, గురువారం

అమ్మ



"అమ్మ నా ప్రపంచం, నా తొలి గురువు, నాకు మంచి విలువలు నేర్పింది ...నాకు అమ్మ ఎప్పుడు ఒక అద్బుతంలా గోచరిస్తుంది ...ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే అంత మంచి అమ్మ దొరికింది నాకూ...అమ్మను ఎప్పుడు గమనిస్తూ ఉండేదాన్ని తను ఎంతో నిశబ్దంగా, చాలా నిరాడంబరంగా ఉండేది, మహోన్నత వ్యక్తి తనూ...పెద్దలంటారు దేవుడు ప్రతి చోట ఉండలేక ప్రత్యన్మయంగా అమ్మను మనకిచ్చాడు అనీ, చాలు ఈ జన్మ కి ఇంకేమీ వద్దు.... "

నా తొలి రచన

మిత్రులారా, ఇది నా తొలి రచన, మీరు నాతో పాటు మీ భావాలను పంచుకుంటారని ఆశిస్తున్నాను...


మీ ప్రియ నేస్తం,


రాధిక

చిన్న నాటి సంగతులు

మన జీవితములో అందరూ మారచిపోని క్షణాలు....బాల్యములో మనము చేసిన అల్లరి..నాకిప్పటికి జ్ఞాపకం వర్షమొస్తే నేను ఎంత ఆనంద పడేదాన్నో! నేస్తాలతో కలిసి పడవలు చేసేవాళ్ళం , బడికి డుమ్మకొట్టి ఊరికి వెళ్ళేవాళ్ళం, అమ్మ పెట్టె అన్నం అందరమూ కలిసి తినేవాళ్ళం, అబ్బో చేతికి రూపాయి దొరికితే పండగే ఇంకా..పెప్పరమేంట్ బిళ్ళలు, చక్రం బిళ్ళలు...ఇంకా చెప్పొద్దూ రంగు పెన్సిళ్ళు....ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలను చూసినప్పుడల్లా నా చిన్న నాటి సంగతులన్నీ ఒక్కొక్కటి గురుతు చేసుకుంటూ ఉంటాను ... వాళ్లతో కలిసి నేను పడువాలు వదులుతాను, అల్లరి చేస్తాను...